సుమో దీదీ రివ్యూ(Sumo Didi Movie Review): అందరూ నవ్విన శరీరమే ఆమె బలమైంది.

సుమో రెజ్లింగ్ అనగానే చాలామందికి జపాన్‌లో భారీ శరీరాలతో తలపడే ఆటగాళ్లే గుర్తొస్తారు. అలాంటి ఆటలో అడుగుపెట్టిన తొలి భారతీయ ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేతల్ దవే. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘సుమో దీదీ’. ట్రైలర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో అందుబాటులో ఉంది. మరి సినిమా ఎలా ఉందంటే..

కథేంటంటే..

హేతల్ (Shriyam Bhagnani)కి చిన్నప్పటి నుంచే హార్మోన్ల సమస్య వల్ల బరువు ఎక్కువ. స్కూల్‌లో తోటి పిల్లలు ఆమెను రకరకాల పేర్లతో ఏడిపిస్తారు. డాక్టర్ల సలహాతో కుటుంబ సభ్యులు ఆమెను జూడోలో చేర్పిస్తారు. అక్కడి నుంచి ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుంది.

పెద్దయ్యాక మాత్రం ఆటలు పక్కనపెట్టి పెళ్లి చేసుకోవాలని తల్లి ఒత్తిడి తెస్తుంది. అదే సమయంలో జపాన్ నుంచి ఒక సుమో కోచ్ హేతల్ శిక్షణ పొందుతున్న కేంద్రానికి వస్తారు. ఆయన్ని చూసిన తర్వాత సుమో రెజ్లర్ కావాలని హేతల్ నిర్ణయించుకుంటుంది. దేశంలో పెద్దగా ఎవరికీ తెలియని ఈ ఆటలో ఆమె ఎలా నిలదొక్కుకుంది? ప్రపంచ ఛాంపియన్‌షిప్ వరకు ఎలా చేరింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

“లావుగా ఉన్నాను, నా వల్ల ఏమవుతుంది” అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. హేతల్ కథ సరిగ్గా ఆ ఆలోచనను తలకిందులు చేస్తుంది. ఏ శరీరాన్ని చూసి అందరూ నవ్వారో, అదే శరీరం ఆమెకు ఆటలో బలంగా మారడం ఈ కథలోని అసలైన పాయింట్. సినిమా పూర్తయ్యాక కూడా ఇది ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుంది.

కుటుంబ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. తండ్రి, తమ్ముడు, స్నేహితుడు హేతల్‌కు అండగా నిలుస్తారు. తల్లి మాత్రం మొదట్లో అడ్డు చెబుతుంది. ఇంట్లోనే ఒకరు ప్రోత్సహిస్తూ, మరొకరు వద్దంటుంటే ఆ అమ్మాయి పడే సంఘర్షణను దర్శకుడు సహజంగా చూపించారు. చాలా మధ్యతరగతి ఇళ్లలో కనిపించే పరిస్థితే ఇది.

ఓటమి ఎదురైనా హేతల్ వెనకడుగు వేయదు. కోల్‌కతా, జపాన్‌లలో ఆమె శిక్షణ సన్నివేశాలు ఈ ఆట కోసం ఆమె పడిన శ్రమను కళ్లకు కడతాయి. దీనికి తోడు స్పాన్సర్‌షిప్ కోసం పడే తిప్పలను కూడా కథలో భాగం చేశారు. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేకపోతే క్రీడాకారులు ఎన్ని ఇబ్బందులు పడతారో ఈ సన్నివేశాలు చెబుతాయి.

Sumo Didi Movie Review And Rating
Sumo Didi Movie Review And Rating

క్రీడా నేపథ్య చిత్రాలంటే మన దగ్గర ఎక్కువగా క్రికెట్టే. ఫుట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్ నేపథ్యంలోనూ సినిమాలు వచ్చాయి. సుమో రెజ్లింగ్, అదీ ఒక మహిళ కథను ఎంచుకోవడం దర్శకుడు జయంత్ రోహత్గీ (Jayant Rohatgi) చేసిన మంచి ప్రయత్నం.

అయితే, ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసినట్టు అనిపిస్తాయి. హేతల్ సుమో వైపు అడుగులు వేసిన తర్వాతే కథనం వేగం అందుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..(Sumo Didi Movie Review)

హేతల్ పాత్రలో శ్రియం భగ్నానీ (Shriyam Bhagnani)ఒదిగిపోయారు. ఈ పాత్ర కోసం ఆమె పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఓటమి ఎదురైనప్పుడు నిస్సహాయత, తిరిగి నిలబడినప్పుడు పట్టుదల, రెండు భావాలనూ బాగా పలికించారు.

దివంగత నటుడు నితేశ్ పాండే (Nitesh Pandey) తండ్రి పాత్రలో ఆకట్టుకుంటారు. కూతురి కోసం నిలబడే తండ్రిగా ఆయన సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి. హేతల్ స్నేహితుడిగా చైతన్య శర్మ పాత్రకు తగ్గట్టు నటించారు.

కుటుంబంతో చూడొచ్చా?

ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకు తప్పకుండా చూపించాల్సిన సినిమా. బాడీ షేమింగ్ ఎంత బాధపెడుతుందో, దాన్ని దాటి ఎలా ముందుకు వెళ్లొచ్చో ఈ కథ ఉపన్యాసాలు లేకుండానే చెబుతుంది. అయితే, సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో కూడా ఉంటే ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యేది.

ప్లస్ & మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

  • హేతల్ దవే స్ఫూర్తిదాయక కథ
  • శ్రియం భగ్నానీ నటన
  • కుటుంబ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

  • నెమ్మదిగా సాగే ప్రథమార్ధం
  • తెలుగు ఆడియో లేకపోవడం

ఫైనల్ వర్డిక్ట్

3.75/5

ఫైనల్‌గా: మహిళల పట్టుదల, కుటుంబ సహకారం, ఓటమి నుంచి గెలుపు వరకు సాగిన ప్రయాణాన్ని చక్కగా చూపించిన మంచి ఇన్‌స్పిరేషనల్ మూవీ సుమో దీదీ. అక్కడక్కడా స్లో నరేషన్ ఉన్నప్పటికీ, మంచి సందేశం కోసం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.