Haiku Movie Review: ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘హైకూ'(Haiku). విడుదలకు ముందే ఒకట్రెండు పాటలు పాపులర్ కావడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. తెలుగులోనూ డబ్ అయిన ఈ ప్రేమకథ ఎలా ఉందంటే..
కథేంటంటే..
ఒక కార్పొరేట్ కంపెనీ. అక్కడ ఒక టీమ్ లీడర్, అతని కింద కొత్తగా చేరిన ట్రైనీలు. ఈ సెటప్‌తో మొదలయ్యే కథ కాసేపటికే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. కాలేజీ రోజుల్లో మొదలైన ఒక ప్రేమ, ఆ ప్రేమికులు ఎందుకు విడిపోయారు, మళ్లీ కలవాలని ఎందుకు అనుకుంటున్నారు అనేదే సినిమా.
ఎలా ఉందంటే..
హైకూ అంటే జపాన్‌కు చెందిన ఒక కవితా ప్రక్రియ. కొద్ది పదాల్లో ఒక చిన్న అనుభూతిని పట్టుకోవడం దాని ప్రత్యేకత. సినిమా కూడా పెద్ద మలుపుల కంటే ప్రేమలోని చిన్న చిన్న క్షణాల మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. టైటిల్‌కు ఆ రకంగా న్యాయం జరిగింది.
కాలేజీ ప్రేమ, స్నేహం, విడిపోవడం, మళ్లీ కలవడం. ప్రేమకథల్లో ఇవన్నీ మనం చాలాసార్లు చూశాం. హైకులోనూ ఇవే ఉన్నా, కార్పొరేట్ ఆఫీస్ నుంచి కాలేజీలోకి కథను తీసుకెళ్లిన తీరు కొత్తగా ఉంది. కొన్ని కాలేజీ ఎపిసోడ్లు కూడా రొటీన్‌కు భిన్నంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో కాలేజీ సీన్లు, ద్వితీయార్ధంలో ఆఫీస్ నేపథ్యంలో వచ్చే కామెడీ, స్నేహితుల మధ్య అనుబంధం సరదాగా సాగుతాయి.
సాధారణంగా ప్రేమకథల్లో కులం, కుటుంబం, డబ్బు లాంటివే ప్రేమికులను విడదీస్తాయి. హైకులో మాత్రం ఇద్దరి మధ్య వచ్చే వ్యక్తిగత గొడవే అసలు సమస్య. ప్రేమలో ఒక చిన్న మాట పెద్ద గొడవకు దారితీస్తుంది, అదే చిన్న మాట మళ్లీ కలుపుతుంది కూడా. ప్రేమికుల మధ్య పొసెసివ్నెస్ను అతి చేయకుండా సహజంగా చూపించారు. కొంతమంది నిజ జీవిత అనుభవాల నుంచి రాసుకున్న కథలా అనిపిస్తుంది.
సమస్యంతా ఇక్కడే ఉంది. ప్రేమికులు ఎందుకు విడిపోయారనే విషయంలో స్పష్టత లోపించింది. కొన్ని డైలాగులు, సన్నివేశాలతో వివరించడానికి ప్రయత్నించినా, ఆ సంఘర్షణ బలంగా లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు. ప్రథమార్ధం చివర్లో వచ్చే హుక్ కూడా ద్వితీయార్ధం కోసం ఎదురుచూసేంత బలంగా లేదు.
తమిళ సినిమా కావడంతో పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు అలాగే ఉంచేశారు. అందుకే అక్కడక్కడా డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ వస్తుంది.
ఎవరెలా చేశారంటే..
కథంతా ఎగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. శ్రీదేవి తన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఫెమినా జార్జ్ ప్రామిసింగ్‌గా కనిపించింది. ఎగన్ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నట్టు కాకుండా ఆ పాత్రే అన్నట్టు అనిపిస్తాడు. ముగ్గురి నటన సహజంగా ఉండటం వల్లే ప్రేమకథలోని భావోద్వేగాలు ప్రేక్షకుడికి చేరతాయి.
సినిమాకు అసలైన బలం సిద్ధు కుమార్ సంగీతం. కథలో ఎక్కడ ఎగుడుదిగుడులు ఉన్నా, పాటలు, నేపథ్య సంగీతం మాత్రం నిరాశపరచవు. ప్రేమకథకు కావాల్సిన ఫీల్‌ను ఎక్కువగా మోసింది మ్యూజిక్కే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
ఎవరికి నచ్చుతుంది?(Haiku Movie Review)
జెన్ జీ ప్రేక్షకులకు, ఫస్ట్ లవ్‌ని గుర్తుచేసుకునేవాళ్లకు హైకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమలో బాధను అనుభవించినవాళ్లకు కొన్ని సన్నివేశాలు తమ కథలానే అనిపిస్తాయి. ట్విస్టులు, ఊహించని మలుపులు ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
కుటుంబంతో చూడొచ్చా?
చూడొచ్చు. ప్రేమికుల మధ్య కొన్ని సన్నిహిత సన్నివేశాలు ఉన్నా, ఎక్కడా ఇబ్బంది పెట్టేలా లేవు.
ప్లస్ & మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్
- శ్రీదేవి, ఎగన్, ఫెమినా జార్జ్ నటన
- సిద్ధు కుమార్ సంగీతం
- కాలేజ్ లైఫ్ సన్నివేశాలు
- ప్రేమలోని భావోద్వేగాలు
- ఫ్రెండ్షిప్, కామెడీ
- జెన్ జీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు
- ఫ్యామిలీతో కలిసి చూడగలిగే లవ్ స్టోరీ
మైనస్ పాయింట్స్
- ప్రధాన సంఘర్షణలో స్పష్టత తక్కువ
- కొన్ని సన్నివేశాల్లో కన్ఫ్యూజన్
- ఫస్ట్ హాఫ్ చివర్లో బలమైన హుక్ లేకపోవడం
- కథలో బలమైన ట్విస్టులు, టర్న్స్ లేకపోవడం
- కథనం కొన్ని చోట్ల సాధారణంగా అనిపించడం
ఫైనల్ వర్డిక్ట్
ఫైనల్‌గా: హైకూ ప్రేమలోని ఫీల్, ఫస్ట్ లవ్ జ్ఞాపకాలు, స్నేహం వంటి అంశాలను ఆస్వాదించేవాళ్లకు నచ్చే డీసెంట్ లవ్ స్టోరీ. సిద్ధు కుమార్ సంగీతం, నటీనటుల సహజమైన నటన సినిమాకు ప్రధాన బలాలు. కథలోని చిన్న చిన్న లోపాలను పక్కనపెడితే ఈ వీకెండ్లో ఒకసారి చూడొచ్చు.

