Telangana Heroes: ఒకప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణ యాస వినిపిస్తే జనాలు నవ్వేటోళ్లు. ఎందుకో తెలుసా? ఆ యాస మాట్లాడే క్యారెక్టర్లను కేవలం కమెడియన్లుగా, పనిమనుషులుగా లేదా విలన్లుగా మాత్రమే చూపించేవాళ్లు. మన భాషను, మన యాసను అవహేళన చేసిండ్రు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన యాస, భాష సినిమా ఇండస్ట్రీలో డైలాగులుగా మారాయి. అయితే అసలు ముచ్చట ఏందంటే.. యాస అయితే మారింది గానీ, సినిమా రంగాన్ని శాసిస్తున్నది మాత్రం తొంభై శాతం ఆంధ్రా హీరోలే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ హీరోలు (Telangana Heroes)ఎదుగుతుంటే వివాదాలేంటి?
తెలంగాణ హీరోలు ఎవడన్నా ఎదుగుతున్నాడంటే చాలు.. వానిని పగబట్టి మరీ టార్గెట్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్వక్ సేన్ లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తన సొంత కష్టంతో పైకి వచ్చిన హీరో సినిమా వస్తుందంటే చాలు.. వివాదాలు సృష్టించడం, ట్రోల్స్ చేయడం ఎందుకు? అనే చర్చ జరుగుతోంది.
ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న నితిన్ పరిస్థితి ఏంది ఈరోజు? సరైన థియేటర్లు దక్కక, రావాల్సిన గుర్తింపు రాక నితిన్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ దేవరకొండపై ఎందుకీ నెగెటివిటీ?
ఇక లేటెస్ట్ సంచలనం విజయ్ దేవరకొండ విషయానికొస్తే, ఆయనపై విమర్శలు కాదు.. ఏకంగా పగబట్టినట్టే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాతి సినిమాల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే.
విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు.. నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలుపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన సినిమా కొంచెం నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు, కొందరు పండగ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ప్రచారం చేయడం, పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్లతో సినిమాను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ నుంచి ఒక పవర్ఫుల్ స్టార్ పుట్టుకొస్తే అంత భయం దేనికి? అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఫేక్ రివ్యూలు, పెయిడ్ ప్రచారాలు దేనికోసం? తెలంగాణ హీరోల (Telangana Heroes)సినిమాలకు ఫస్ట్ షో పడకముందే డిజాస్టర్, చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నారు? సినిమా కంటెంట్‌తో సంబంధం లేకుండా రూమర్లు ఎందుకు సృష్టిస్తున్నారు?
అదే ఇతర పెద్ద హీరోల సినిమాల విషయానికొస్తే, అవి ఫ్లాప్ అయినా కలెక్షన్ల రికార్డులంటూ ప్రచారం చేస్తుంటారని విమర్శలు ఉన్నాయి. ఇది కుట్ర కాదా? ఇది వివక్ష కాదా? అనేది ఆలోచించాల్సిన విషయం.
దిల్ రాజు గారూ.. తెలంగాణ సినిమా రంగానికి ఏం చేస్తున్నారు?
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న దిల్ రాజు గారిని సూటిగా అడుగుతున్నా.. మీరు ఆ స్థానంలో ఉండి తెలంగాణ సినిమా రంగానికి ఏం చేస్తున్నారు అసలు?
కేవలం మీ సొంత బ్యానర్లలో సినిమాలు తీసి లాభాలు సంపాదిస్తే తెలంగాణ సినిమా డెవలప్ అయినట్టేనా? తెలంగాణ నుంచి వస్తున్న కొత్త దర్శకులకు, కొత్త హీరోలకు (Telangana Heroes)ఇండస్ట్రీలో దక్కుతున్న వాటా ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
తొంభై శాతం ఆంధ్రా హీరోలే సినిమా రంగాన్ని ఆక్రమించుకున్నారనే విమర్శల నేపథ్యంలో, హీరోలు, దర్శకుల లెక్కలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నటులకు ఇప్పటివరకు ఎంత శాతం అవకాశాలు దక్కాయో స్పష్టంగా తెలుస్తుంది.
ఇది కొందరు హీరోల సమస్య కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ సమస్య!
ఇది కేవలం కొందరు హీరోల సమస్య మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇకనైనా తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు తెలంగాణ వాసులకు అవకాశాలు కల్పించాలి. తెలంగాణ నుంచి వస్తున్న హీరోలను, హీరోయిన్లను ప్రోత్సహించాలి.
ఎదుగుతున్న తెలంగాణ హీరోలను పక్కా ప్లాన్లతో పెయిడ్ రివ్యూలు, పనిగట్టుకొని చేసే విషప్రచారాలతో తొక్కేయాలని చూడకూడదు. సినిమా నచ్చకపోతే విమర్శించడంలో తప్పులేదు. కానీ సినిమా చూడకముందే నెగెటివ్ ప్రచారం చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదు.
మూడు నాలుగు కుటుంబాలే సినిమా ప్రపంచాన్ని ఏలాలా?
కేవలం మూడు నాలుగు కుటుంబాలే సినిమా ప్రపంచాన్ని ఏలడం ఏందసలు? కొత్తవాళ్లకు, ప్రతిభ ఉన్న తెలంగాణ కళాకారులకు అవకాశాలు దక్కకపోతే ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చెందుతుంది?
కాబట్టి తెలంగాణ దర్శక, నిర్మాతలారా.. ఇకనైనా ఆలోచించుడు. తెలంగాణ వాళ్లకు అవకాశాలు ఇవ్వండి. తెలంగాణ సినిమా రంగాన్ని ఎదగనియ్యండి. మన ప్రాంతం నుంచి మంచి నటులు, దర్శకులు, నిర్మాతలు వచ్చినప్పుడు వారికి అండగా నిలవండి.
లేకపోతే తెలంగాణ సినిమా ఎదగకుండా మనమే అడ్డుపడిన వాళ్లం అవుతాం. ఒక్కసారి ఆలోచన చేయండి.

