Tollywood Stars First Movies: సినిమా రంగంలో అవకాశం దొరకడమే కష్టం. వేల మందిలో ఒకరు నటులవుతారు, లక్షల మందిలో ఒకరు హీరో లేదా హీరోయిన్ అవుతారు. ఇప్పుడు మనం స్టార్లుగా చూస్తున్న చాలామంది కెరీర్ మొదట్లో ఒకటి రెండు సీన్ల పాత్రలు, డైలాగ్ కూడా లేని బ్యాక్‌గ్రౌండ్ రోల్స్ చేశారు. అప్పుడు వాళ్ల పేర్లు కూడా ఎవరికీ తెలియదు. అలాంటి 15 మంది తారల తొలి పాత్రలు ఇవి.

15. సంతోష్ శోభన్

‘గోల్కొండ హైస్కూల్’లో స్కూల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గౌతమ్‌గా కనిపించిన కుర్రాడే సంతోష్ శోభన్. కొన్నేళ్ల తర్వాత ‘తను నేను’తో హీరోగా పరిచయమయ్యాడు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.

14. రీతూ వర్మ

హైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ మొదట ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘బాద్‌షా’లో కాజల్ కజిన్ పింకీగా చిన్న పాత్ర చేసింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో హీరోయిన్‌గా మారి, ‘పెళ్లి చూపులు’తో గుర్తింపు తెచ్చుకుంది.

13. సత్యదేవ్

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించాడు. చిన్న పాత్రల నుంచి సపోర్టింగ్ రోల్స్‌కి, అక్కడి నుంచి హీరోగా మెల్లగా ఎదిగాడు.

12. రాశీ ఖన్నా

2013లో హిందీ సినిమా ‘మద్రాస్ కేఫ్’తో రాశీ ఖన్నా పరిచయమైంది. తెలుగులో హీరోయిన్‌గా తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అయినా, అంతకుముందే ‘మనం’లో నాగచైతన్య ప్రేమించే అమ్మాయి ప్రేమగా అతిథి పాత్రలో మెరిసింది.

11. సునీల్

1995లో డ్యాన్స్ స్కూల్‌లో చేరి చిన్న షోల్లో డ్యాన్స్ చేసిన సునీల్, 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు మధ్యలో ఆగిపోవడమో, ఆలస్యం కావడమో జరిగింది. అప్పుడే స్నేహితుడు త్రివిక్రమ్ తాను మాటలు రాసిన ‘స్వయంవరం’, ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. ‘నువ్వే కావాలి’ తర్వాత స్టార్ కమెడియన్‌గా, ఆ తర్వాత హీరోగా మారాడు. నిజానికి సునీల్ ఇండస్ట్రీకి వచ్చింది విలన్ కావాలని. ఇప్పుడు అప్పుడప్పుడు నెగెటివ్ రోల్స్ చేస్తూ ఆ కోరిక తీర్చుకుంటున్నాడు.

10. సాయి పల్లవి(Tollywood Stars First Movies)

‘ప్రేమమ్’ (2015)కి పదేళ్ల ముందే సాయి పల్లవి ‘కస్తూరిమాన్’ (2005) అనే మలయాళ సినిమాలో చిన్న పాత్ర చేసింది. 2008లో తమిళ సినిమా ‘ధామ్ ధూమ్’లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించింది. తర్వాత టీవీ డ్యాన్స్ షోలతో పేరు తెచ్చుకుని, ‘ప్రేమమ్’తో హీరోయిన్ అయింది.

9. శివకార్తికేయన్

కాలేజీ రోజుల్లో మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేసిన శివకార్తికేయన్, ఒక టీవీ కామెడీ షో విజేతగా నిలిచి తర్వాత యాంకర్‌గా మారాడు. అప్పట్లోనే దర్శకుడు అట్లీ తీసిన షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. దాంతో 2008లో అజిత్ సినిమా ‘ఏగన్’లో ఒక పాత్ర వచ్చింది, కానీ ఫైనల్ ఎడిటింగ్‌లో అది కట్ అయింది. 2012లో ‘మెరీనా’తో హీరోగా వచ్చాడు. ధనుష్ ‘3’లో కామెడీ ట్రాక్ వర్కౌట్ కావడంతో ‘మనం కొత్తి పరవై’ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణిస్తున్నాడు.

8. కాజల్ అగర్వాల్

దక్షిణాదికి రాకముందు 2004లో హిందీ సినిమా ‘క్యూఁ! హో గయా నా’లో ఐశ్వర్యా రాయ్ పక్కన చిన్న పాత్రలో కనిపించింది కాజల్. 2006లో తమిళ సినిమా ‘బొమ్మలాట్టం’తో హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉన్నా, అది 2008 వరకు విడుదల కాలేదు. ఈలోపు 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగులో అడుగుపెట్టింది. ‘చందమామ’, ‘మగధీర’తో స్టార్ హీరోయిన్ అయింది.

7. అడివి శేష్

థ్రిల్లర్ సినిమాలకు పేరుపొందిన అడివి శేష్ తొలిసారి 2002లో ‘సొంతం’లో నమిత కాబోయే భర్త వెంకట్‌గా కనిపించాడు. చాలా గ్యాప్ తర్వాత 2010లో ‘కర్మ’తో దర్శకుడిగా, హీరోగా వచ్చాడు. 2011లో ‘పంజా’లో మున్నా పాత్రతో గుర్తింపు వచ్చింది. ‘క్షణం’ నుంచి హీరోగా వెనుదిరిగి చూడలేదు.

6. త్రిష

1999లో మిస్ చెన్నై టైటిల్ గెలవడంతో త్రిష సినీ ప్రయాణం మొదలైంది. అదే ఏడాది ‘జోడి’లో సిమ్రన్ స్నేహితురాలిగా కనిపించింది. ఫాల్గుణి పాఠక్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్‌లోనూ నటించింది. ‘లేసా లేసా’తో హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉన్నా, అది ఆలస్యం కావడంతో సూర్యతో చేసిన ‘మౌనం పేసియదే’ (2002) ముందు విడుదలైంది.

5. నిఖిల్ సిద్ధార్థ్

‘హ్యాపీ డేస్’లో రాజేశ్‌గా పాపులర్ అయిన నిఖిల్, దానికి నాలుగేళ్ల ముందే ‘సంబరం’లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. 2006లో ‘హైదరాబాద్ నవాబ్స్’లో చిన్న పాత్ర చేస్తూనే ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘హ్యాపీ డేస్’ తర్వాత కొన్ని ఫ్లాపులు ఎదురైనా, ‘స్వామి రా రా’తో కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టుకున్నాడు.

4. విజయ్ సేతుపతి

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి 16 ఏళ్ల వయసులో కమల్ హాసన్ ‘నమ్మవర్’ కోసం ఆడిషన్ ఇచ్చాడు. హైట్ తక్కువగా ఉన్నాడని రిజెక్ట్ చేశారు. మరుసటి ఏడాది 1996లో ‘గోకులత్తిల్ సీతై’లో చిన్న పాత్ర చేశాడు. చదువు అయ్యాక చెన్నైలో ఒక థియేటర్ గ్రూప్‌లో అకౌంటెంట్‌గా చేరి, అక్కడే నాటకాల్లో నటించాడు. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్.. అన్నీ చేశాడు. 2010లో ‘తెన్మేర్కు పరువక్కాట్రు’తో హీరోగా మారి, ఇప్పుడు అత్యంత బిజీ నటుల్లో ఒకడిగా ఉన్నాడు.

3. విజయ్ దేవరకొండ

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ తొలి సినిమా రవిబాబు తీసిన ‘నువ్విలా’ (2011). అందులో క్రికెట్ ఆడే విష్ణు పాత్రలో కనిపించాడు, డైలాగులు చాలా తక్కువ. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అజయ్‌గా చిన్న పాత్ర చేశాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో రిషి పాత్రతో అందరికీ నచ్చేశాడు. 2016లో ‘పెళ్లి చూపులు’తో హీరో అయ్యాడు.

2. అజిత్ కుమార్

తమిళ టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ 19 ఏళ్ల వయసులో 1990లో ‘ఎన్ వీడు ఎన్ కనవర్’లో ఒకే సీన్‌లో టీనేజర్‌గా కనిపించాడు. హీరోగా తొలి సినిమా తెలుగులో ‘ప్రేమ పుస్తకం’ కావాల్సి ఉన్నా, దాని షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈలోపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిఫార్సుతో 1993లో తమిళ సినిమా ‘అమరావతి’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అయినా, బైక్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంతో ఏడాదిన్నర బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్, మోడలింగ్ చేసి, 1995లో ‘ఆశై’తో మళ్లీ హీరోగా నిలదొక్కుకున్నాడు.

1. రవితేజ

విజయశాంతి బ్లాక్‌బస్టర్ ‘కర్తవ్యం’ (1990)లో విలన్ గ్యాంగ్‌లో ఉండే చక్రవర్తి స్నేహితుడిగా కనిపించేది రవితేజే. ‘అంకుశం’ కన్నడ రీమేక్ ‘అభిమన్యు’లో స్టూడెంట్ లీడర్‌గా, 1991లో నాగార్జున ‘చైతన్య’లో రేసర్‌గా చిన్న పాత్రలు చేశాడు. (Tollywood Stars First Movies)తర్వాత కొన్ని తెలుగు, హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘సింధూరం’లో చిన్న పాత్ర నుంచి ‘నీ కోసం’తో హీరోగా మారి, అడుగు అడుగు ఎదుగుతూ మాస్ మహారాజా అయ్యాడు.