Aadarsha Kutumbam Movie Review: 

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రకమైన సినిమా ఆశిస్తారు. ‘ఆదర్శ కుటుంబం’ ఆ అంచనాలను దాదాపు అందుకుంది. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సత్య, రావు రమేష్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.

కథేంటి?

అప్పులతో నెట్టుకొస్తున్న ఓ మధ్యతరగతి కుటుంబానికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బు కోసం కొందరు రంగంలోకి దిగుతారు. అక్కడి నుంచి కుటుంబం పడే తిప్పలు, మధ్యలో వచ్చే నవ్వులు, చివర్లో అసలు విషయం. కథ పెద్దగా కాంప్లికేటెడ్ కాదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. కానీ విధి, ప్రకృతి లాంటి అంశాలను కథలో కలిపిన తీరు దీన్ని సాధారణ కమర్షియల్ సినిమాల నుంచి కొంచెం వేరు చేస్తుంది.

సినిమాకు ప్రాణం క్లైమాక్స్(Aadarsha Kutumbam Movie Review)

సినిమా మొత్తం మీద కొన్ని సీన్లు చూస్తుంటే ఇది ఎందుకు జరిగింది, ఇంత లిబర్టీ ఎందుకు తీసుకున్నారు అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’లో చివర్లో ఎలాంటి సంతృప్తి కలుగుతుందో ఇక్కడా అదే ఫీలింగ్. రావు రమేష్ చెప్పే చివరి డైలాగ్ కూడా బాగా పేలింది.

‘గుంటూరు కారం’ క్లైమాక్స్ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఆ సినిమాలో మధ్య భాగాన్ని మహేష్ బాబు ఒక్కరే మోశారు. ఇక్కడ మధ్యలో వచ్చే సీన్లకూ బలం ఉంది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఏదీ ఇంకోదాన్ని మింగేయలేదు. ప్రభాస్‌కి సంబంధించిన ఓ చిన్న సీన్ కూడా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ మాత్రం గాడిన పడటానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా ఊపందుకుంటుంది.

వెంకటేశ్, సత్య షో

వెంకటేశ్ కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే బాగుంది. (Aadarsha Kutumbam Movie Review)ఒకటి రెండు ఎమోషనల్ సీన్లలో అయితే ఆయన అనుభవం స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేశ్ అంటేనే ఎమోషన్ అని మరోసారి గుర్తు చేశారు.

సినిమాలో అసలు సర్‌ప్రైజ్ సత్య. ఇంటర్వెల్ దగ్గర, సెకండ్ హాఫ్‌లో అతని సీన్లకు థియేటర్‌లో నవ్వులు ఆగవు. త్రివిక్రమ్ ఈ పాత్రను పూర్తిగా వాడుకున్నారు. శ్రీనిధి శెట్టి తన పాత్ర మేరకు బాగా చేశారు. పిల్లలు, రఘుబాబు, రావు రమేష్ కూడా ఆకట్టుకుంటారు.

పాటలే పెద్ద మైనస్

తమన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ లాంటి ఆల్బమ్స్ ఇచ్చిన కాంబినేషన్ నుంచి ఇలాంటి పాటలు ఊహించలేం. సంగీతం బాగుండి ఉంటే సినిమా స్థాయి ఇంకా పెరిగేది.

సెకండ్ హాఫ్‌లో డింపుల్ హయాతి కనిపించే ఓ పాట పూర్తిగా అనవసరం. కథ మంచి ఫ్లోలో ఉన్నప్పుడు సడెన్‌గా వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఆ పాట లేకపోయినా సినిమాకు ఏ నష్టం ఉండేది కాదు.

త్రివిక్రమ్ ఎలా చేశారు?

ఎంచుకున్న కాన్సెప్ట్ నుంచి త్రివిక్రమ్ పెద్దగా పక్కకు వెళ్ళలేదు. శంకర్ లాంటి సోషల్ మెసేజ్ కాదు, అట్లీ లాంటి మాస్ మెసేజ్ కాదు. ఆయన మెసేజ్ కమర్షియల్ కథలోనే ఒదిగిపోతుంది. ఇక్కడా అదే జరిగింది.

ఒక్కటే ఫిర్యాదు. గత సినిమాల్లో హిట్ అయిన ఫార్ములాలను మళ్ళీ వాడుతున్నారనే ఫీలింగ్ అక్కడక్కడ వస్తుంది. ‘అల వైకుంఠపురములో’లోని కొన్ని ఛాయలు ఇక్కడా కనిపిస్తాయి. (Aadarsha Kutumbam Movie Review)త్రివిక్రమ్ కొత్తగా రాయగలరని అందరికీ తెలుసు, అందుకే ఈ విషయం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అయినా ఓవరాల్‌గా చూస్తే ఆయన దాదాపు పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు.

ఫ్యామిలీ సినిమా అయినా కొన్ని హింసాత్మక సీన్లు ఉన్నాయి. యూ/ఏ సర్టిఫికెట్ కోసం కొన్నిచోట్ల బ్లర్ వాడారు. పిల్లలతో వెళ్ళేవాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి.

ప్లస్ & మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

  • క్లైమాక్స్
  • వెంకటేశ్ నటన
  • సత్య కామెడీ
  • ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్

  • తమన్ పాటలు
  • సెకండ్ హాఫ్‌లో అనవసరమైన పాట
  • నెమ్మదిగా మొదలయ్యే ఫస్ట్ హాఫ్
  • గత సినిమాల ఫార్ములా ఛాయలు

ఫైనల్ వర్డిక్ట్

2.75/5

ఫైనల్‌గా: పాటలు, ఓ అనవసరమైన పాట, నెమ్మదిగా మొదలయ్యే ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే 'ఆదర్శ కుటుంబం' వీకెండ్‌కి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లైమాక్స్ ఒక్కటే టికెట్ డబ్బులకు న్యాయం చేస్తుంది. ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పని లేదు, కానీ కుటుంబంతో కలిసి చూడొచ్చు.