Summer Holidays Movie Review and Rating : ఇప్పటి పిల్లలకు వేసవి సెలవులంటే సమ్మర్ క్యాంపులు, ట్యూషన్లే. ఒకప్పుడు అమ్మమ్మ ఇల్లు, ఊరు, మామిడి తోటలు ఉండేవి. ఆ జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసే సినిమానే ‘సమ్మర్ హాలిడేస్’. ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని స్టార్ వాల్యూ లేకుండా పిల్లల కథతో ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే
సిటీలో పెరిగిన అరుణ్ వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్తాడు. అక్కడ ఉండే రోహన్‌తో స్నేహం ఏర్పడుతుంది. చదువు, చదువు అంటూ ఒత్తిడిలో పెరిగిన సిటీ కుర్రాడికి, స్వేచ్ఛగా ఆడుకునే పల్లెటూరి కుర్రాడి జీవితం కొత్తగా అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి చేసే అల్లరి, ఎదురయ్యే సంఘటనలు, ఈ క్రమంలో ఇద్దరిలో వచ్చే మార్పు మిగతా కథ. అమ్మమ్మ ఇల్లు, అమ్మ చదువుకున్న బడి, అమ్మమ్మ చేతి ఆవకాయ లాంటి జ్ఞాపకాలు సినిమాలో కనిపిస్తాయి.
ఎలా ఉందంటే (Summer Holidays Movie Review and Rating)
ఇది గొప్ప అద్భుతమనిపించే సినిమా కాదు. కానీ మంచి కథ, చక్కని భావోద్వేగం ఉన్న సినిమా. రోజంతా చదువే అంటూ పిల్లల్ని చదువుల్లో ముంచేస్తున్న మైక్రో ఫ్యామిలీల కాలంలో, పిల్లల్ని పిల్లల్లా ఎదగనివ్వాలన్న సందేశం ఇందులో ఉంది. ఊరు వదిలి వేరే ఊరికి వలస వెళ్ళిన చాలామందికి తమ అమ్మమ్మ ఇల్లు, పల్లెటూరు గుర్తుకొస్తాయి. సినిమా నిడివి గంటా యాభై ఐదు నిమిషాలు మాత్రమే. అలా వెళ్ళి ఇలా అయిపోతుంది. అక్కడక్కడ చిన్న చిన్న పాటలు వస్తాయి.
అయితే లోపాలు లేకపోలేదు. మొదటి భాగం ఇంకొంచెం వేగంగా సాగితే బాగుండేది. హర్షవర్ధన్ పాత్రలో కావాలని నెగటివిటీని చూపించినట్టు, మెలోడ్రామా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదీ కాస్త తగ్గిస్తే బాగుండేది. పన్నెండు, పదిహేనేళ్ల వయసు పిల్లల మధ్య ఆకర్షణను తెరపై చూపించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కథలో కొన్ని సినిమాటిక్ లిబర్టీలు కూడా తీసుకున్నారు, మామిడి తోట సన్నివేశాల్లో అవి కనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే
పిల్లలే ఈ సినిమా బలం. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి వాటితో పేరు తెచ్చుకున్న రోహన్, ‘35 – చిన్న కథ కాదు’తో గుర్తింపు పొందిన అరుణ్ ఇద్దరూ చూడముచ్చటగా కుదిరారు. ఆ ఊరి పిల్లాడు, పెద్ద సిటీ పిల్లాడు కలిసినప్పుడు ఉండే భావోద్వేగాన్ని ఇద్దరూ బాగా పండించారు. బేబీ ఖుషి కూడా బాగా చేసింది.
చాలా కాలం తర్వాత అమ్మమ్మగా జయసుధ మెప్పించారు. (Summer Holidays Movie Review and Rating)రాజీవ్ కనకాలతో ఆమెకు ఉన్న ఒకే ఒక్క సన్నివేశం ఆమె నటనలోని రాజసాన్ని, సహజత్వాన్ని చెప్పకనే చెప్పింది. రాజీవ్ కనకాల మామిడి తోట యజమానిగా గోదావరి యాసలో బాగున్నారు. యాంకర్‌గా పేరు తెచ్చుకున్న హర్షిణి కోడూరి రోహన్ తల్లి పాత్రలో ఊహించని విధంగా ఆకట్టుకున్నారు. కొన్ని ఊళ్లలో తాగుడు కోసం భార్యలను హింసించే సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. వాసుకి కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ప్రతి పాత్ర చిన్నగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
సాంకేతికంగా
దర్శకుడు శ్రీకర్ తన మొదటి సినిమాలోనే సత్తా చాటారు. తన చిన్ననాటి జ్ఞాపకాలే ఆధారంగా ఈ కథను నీట్‌గా రాసుకుని, భావోద్వేగంగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. సింజిత్ సంగీతం, కిట్టు సాహిత్యం, సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం కథకు తగ్గట్టు ఉన్నాయి. గోదావరి జిల్లా నేపథ్యం, స్కూలు, పల్లెటూరి వాతావరణం చూసేవారికి తమ ఊరు గుర్తుకు వస్తుంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని డబ్బు గురించి ఆలోచించకుండా, నచ్చిన భావోద్వేగానికి కనెక్ట్ అయి సినిమా తీశానని మొదటి నుంచి చెప్తున్నారు. ఆ చిత్తశుద్ధి తెరపై కనిపిస్తుంది.
Also Read : రావణుడిగా యష్ విశ్వరూపం, తెరపై అయోధ్య, లంక
ప్లస్ & మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్
- పిల్లల నటన
- జయసుధ, రాజీవ్ కనకాల, హర్షిణి కోడూరి
- భావోద్వేగభరిత కథ, నిడివి
- పల్లెటూరి వాతావరణం
మైనస్ పాయింట్స్
- మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగడం
- హర్షవర్ధన్ పాత్రలో అతి మెలోడ్రామా
ఫైనల్ వర్డిక్ట్
ఫైనల్‌గా: పెద్ద హడావుడి లేని, ప్రశాంతంగా చూసే సినిమా ఇది. చిన్న పిల్లలతో కుటుంబమంతా కలిసి చూడదగ్గ యూనివర్సల్ సినిమా. పిల్లల్ని చదువుల పేరుతో అదుపు చేయకుండా, వారి బాల్యాన్ని వారికి ఇవ్వాలన్న సందేశం ఉంది. పిల్లలకు తప్పక చూపించాల్సిన సినిమా ఇది.
