Ramayana Part 1 Review And Rating : ఆదిపురుష్ దెబ్బ తర్వాత రామాయణం పేరుతో ఇంకో పెద్ద సినిమా వస్తోందంటే చాలామందిలో ఆసక్తితో పాటు భయం కూడా ఉంది. ఈసారైనా మన ఇతిహాసానికి న్యాయం జరుగుతుందా అని. నితీష్ తివారీ, రణ్‌బీర్, యష్ కాంబినేషన్లో వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’ ఆ భయాన్ని పోగొట్టిందా? చూద్దాం.
కథేంటంటే(Ramayana Part 1 Review And Rating )
రామాయణ కథ మనకు కొత్త కాదు. ఈ సినిమాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించారన్నదే అసలు విషయం. రావణుడి తపస్సు, బ్రహ్మ వరం, దేవలోకంపై ఆధిపత్యం, లంకను సొంతం చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత రాముడి బాల్యం, విద్యాభ్యాసం, సీతతో వివాహం, పరశురాముడి ఘట్టం, కైకేయి వరాలు, వనవాసం, శూర్పణఖ ఎపిసోడ్ వస్తాయి. రావణుడు సీతను అపహరించడం, జటాయువు అడ్డుకోవడం, చివరగా రాముడి శపథంతో మొదటి భాగానికి తెర పడుతుంది.
ప్రతిదానికీ ఓ లాజిక్
ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఒక్క సీన్ కూడా వేస్ట్ అనిపించదు. ప్రతి సన్నివేశం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. పాత సినిమాల్లో రాముడు యుద్ధంలో బాణాలు వరసపెట్టి వదులుతుంటే, అవి అయిపోవేంటి అని చిన్నప్పుడు మనలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఈ సినిమాలో దానికీ ఓ కారణం చూపించారు. లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శూర్పణఖ రాముడికి పెళ్లయిందని తెలిసీ ఎందుకు మోహిస్తుంది? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ సినిమాలో ఓ వివరణ ఉంటుంది. కథ తెలిసినవాళ్లకు కూడా కొత్తగా అనిపించేది ఇక్కడే.
ఫస్ట్ హాఫ్ పక్కా
ఓపెనింగ్‌లోనే రావణుడి ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌తో దర్శకుడు టోన్ సెట్ చేశాడు. (Ramayana Part 1 Review And Rating )ఆ పాత్రను నెమ్మదిగా బిల్డ్ చేసిన తీరు బాగుంది. ఆ తర్వాత అయోధ్యలోకి అడుగుపెట్టాక కథ కాస్త ప్రశాంతంగా సాగుతుంది. రామలక్ష్మణుల అనుబంధం, దశరథుడి కుటుంబం, మిథిలలో సీతా స్వయంవరం అన్నీ పద్ధతిగా వస్తాయి.
పరశురాముడి ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్‌కు పెద్ద హై. పరశురాముడు గండ్రగొడ్డలి విసిరితే రాముడు దాన్ని ఒంటి చేత్తో పట్టుకుని నిలబడే షాట్‌కు థియేటర్ దద్దరిల్లిపోయింది. రాముడు వనవాసానికి వెళ్లే ముందు అయోధ్యలో జరిగే డ్రామా సినిమాకు ఇంకో బలం. దశరథుడితో వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తాయి. డ్రామా ఎక్కువే అయినా ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ వరకు సినిమా ఫుల్ స్పీడ్‌లో వెళ్తుంది.
సెకండ్ హాఫ్ కాస్త నెమ్మది, క్లైమాక్స్ అదుర్స్(Ramayana Part 1 Review And Rating )
సెకండ్ హాఫ్‌లో మాత్రం సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. రామాయణాన్ని కమర్షియల్ సినిమాలా పరుగులు పెట్టించలేరు కాబట్టి ఇది అర్థం చేసుకోదగ్గదే. రాక్షసులతో ఫైట్, భరతుడు అడవికి వచ్చి రాముడిని కలిసే సీన్ బాగున్నాయి.
ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ పుంజుకుంటుంది. జటాయువు, రావణుడి మధ్య పోరాటం ఈ సినిమాకు గుండెకాయ. బాగుంటుందని అందరూ ఊహించిన సీనే అయినా, తెరపై చూశాక ఆ అంచనాలను మించిపోయిందనిపిస్తుంది. జటాయువును ఇంత శక్తిమంతుడిగా, ఇంత వీరోచితంగా ఇంతకుముందు ఏ సినిమాలోనూ చూడలేదు. ఆ పోరాటంలో జటాయువు రావణుడి తలను నరికేస్తాడు. కానీ బ్రహ్మ వరం వల్ల రావణుడు చావడు. ఈ డీటెయిల్‌ను కూడా సరిగ్గా చూపించారు. జటాయువు చనిపోయాక పక్షులన్నీ వచ్చి కట్టెలు పేర్చే సీన్ కళ్లు చెమర్చేలా చేస్తుంది. శూర్పణఖ పక్షి రూపంలోకి మారే సీన్ కూడా ఆకట్టుకుంటుంది.
సినిమా నిడివి మూడు గంటలు దాటింది. అయినా విసుగు అనిపించదు. (Ramayana Part 1 Review And Rating )ఇంకా చెప్పాలంటే దశరథుడు, కైకేయి లాంటి పాత్రలకు ఇంకొంచెం టైమ్ ఇచ్చి, ఎమోషన్ ఇంకాస్త పండిస్తే బాగుండేదనిపిస్తుంది. రామాయణం విషయంలో నిడివి ఎక్కువైనా మన ప్రేక్షకులు కూర్చుని చూస్తారు. పార్ట్ 2 విషయంలో మేకర్స్ ఆ భయం పెట్టుకోకపోవడమే మంచిది.

ఎవరెలా చేశారంటే
ఈ సినిమాకు యషే ప్రాణం. రావణుడిగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేదు. ఒక్క చూపుతోనే భయం పుట్టిస్తాడు. ఆయన ఎంట్రీ ఫైట్ వేరే లెవెల్. అంతకంటే ముఖ్యమైన విషయం, ఫస్ట్ హాఫ్ రావణుడికీ సెకండ్ హాఫ్ రావణుడికీ మధ్య తేడాను చూపించిన తీరు. లంకకు రాజయ్యే ముందు ఒకలా, రాజయ్యాక పెరిగిన అహంకారంతో ఇంకోలా కనిపిస్తాడు. ఆ మార్పును యష్ తన బాడీ లాంగ్వేజ్‌లోనే చూపించాడు. విలన్ పాత్రకే థియేటర్లో విజిల్స్ పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
రాముడి పాత్రకు రణ్‌బీర్ సరిపోతాడా అని రిలీజ్‌కు ముందు చాలామందికి డౌట్ ఉండేది. సినిమా చూశాక ఆ డౌట్ పోతుంది. ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సహజంగా చేశాడు. రాముడిలో ఉండాల్సిన రాజసం, వినయం, ధర్మం పట్ల నిబద్ధత, అవసరమైనప్పుడు తెగించి పోరాడే గుణం అన్నీ ఆయన నటనలో కనిపిస్తాయి. విశేషం ఏంటంటే, పరశురాముడి పాత్రలో కూడా రణ్‌బీరే కనిపిస్తాడు. రెండు పాత్రల మధ్య తేడాను ఆయన చూపించిన తీరు బాగుంది. కొన్ని సీన్లలో రణ్‌బీర్ ఎక్స్ప్రెషన్స్కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడై గూస్బంప్స్ వస్తాయి.
సీతగా సాయి పల్లవి గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. కానీ మిగతా పాత్రలతో పోలిస్తే ఆమె పాత్ర అంతగా రిజిస్టర్ కాలేదు. డైలాగులు ఇంకాస్త బలంగా రాసుంటే బాగుండేది. బాగాలేదని కాదు, పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఆగిపోయింది. లక్ష్మణుడిగా రవి దూబే బాగా చేశాడు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న డైలాగులు సహజంగా ఉన్నాయి. దశరథుడిగా అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఒకప్పుడు టీవీలో రాముడిగా అలరించిన అరుణ్ గోవిల్‌ను ఇప్పుడు దశరథుడిగా చూడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించేది తక్కువసేపే.
Cast And Crew Source
సాంకేతికంగా
విఎఫ్ఎక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన డీఎన్ఈజీ టీమ్ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందించింది. ఆ క్వాలిటీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఇండియన్ సినిమాలో ఈ రేంజ్ విజువల్స్ ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. అయోధ్య, మిథిల, లంక నగరాలను డిజైన్ చేసిన తీరు చూస్తే ఆ రాజ్యాలు నిజంగా ఇలాగే ఉండేవేమో అనిపిస్తుంది. ముఖ్యంగా లంకలోని ప్యాలెస్‌లు, వాటి డీటెయిలింగ్ అదిరిపోయాయి. అడవుల్లో వచ్చే సీన్లు కూడా కళ్లకు పండగే.
ఐరావతం, పుష్పక విమానం, జటాయువు అన్నీ గ్రాఫిక్స్ అని తెలియనంత సహజంగా ఉన్నాయి. పుష్పక విమానం డిజైన్ చూస్తే అది నిజంగా ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. ఓ సీనియర్ నటిని డీ-ఏజింగ్ టెక్నాలజీతో యవ్వనంలో ఉన్నట్టు చూపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. రాక్షసుల డిజైన్ దగ్గర మాత్రం కొన్నిచోట్ల బొమ్మల్లా అనిపిస్తుంది. ఈ చిన్న లోపం తప్ప విజువల్స్ విషయంలో వంక పెట్టడానికి పెద్దగా ఏమీ లేదు.
హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఇచ్చిన సంగీతం సినిమాను ఇంకో మెట్టు ఎక్కించింది. (Ramayana Part 1 Review And Rating )ఫస్ట్ హాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో మాత్రం కొన్నిచోట్ల సైలెంట్ అయిపోయింది. రావణుడి ఎంట్రీ దగ్గర, కొన్ని యాక్షన్ సీన్లలో కూడా ఆశించినంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. క్లైమాక్స్‌లో మాత్రం మళ్లీ గట్టిగా వినిపించి థియేటర్‌ను నిద్ర లేపింది.
ఇంత పెద్ద ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తీయడం నితీష్ తివారీకి చిన్న బాధ్యత కాదు. కీలకమైన ఘట్టాలేవీ మిస్ కాకుండా, ప్రతి పాత్రకు ఒక గ్రాఫ్ ఇస్తూ కథను నడిపించాడు. తన మనసులో ఊహించుకున్న విజువల్ ప్రపంచాన్ని తెరపైకి తేవడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు.
ఆదిపురుష్ సమయంలో ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని మేకర్స్ చెప్పారు. ఆ మాట నిజంగా సూట్ అయ్యేది ఈ సినిమాకే. రెండింటినీ పోల్చడమే అనవసరం. అంత తేడా ఉంది.
స్వయంవరంలో రావణుడు ఏమయ్యాడు?
సినిమా చూసిన చాలామందికి వచ్చిన ఒక డౌట్ ఇది. మనం చూసిన పాత తెలుగు సినిమాల్లో, నాటకాల్లో సీతా స్వయంవరానికి రావణుడు కూడా వస్తాడు. శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి భంగపడతాడు. కానీ ఈ సినిమాలో ఆ సీనే లేదు. ఏది నిజం?
నిజానికి వాల్మీకి రామాయణంలో స్వయంవర సభలో రావణుడు ధనుస్సు ఎత్తడానికి ప్రయత్నించిన ఘట్టం లేదు. (Ramayana Part 1 Review And Rating )బాలకాండలో జనకుడు విశ్వామిత్రుడికి చెప్పే మాటల ప్రకారం, అంతకుముందు ఎందరో రాజులు వచ్చి ధనుస్సును కదపలేక వెనుదిరిగారు. ఆ తర్వాత విశ్వామిత్రుడితో కలిసి మిథిలకు వచ్చిన రాముడు ధనుస్సును ఎత్తి విరిచేస్తాడు. రావణుడి ప్రస్తావన అక్కడ ఉండదు. తులసీదాసు రామచరితమానస్లో రావణుడు, బాణాసురుడు ధనుస్సును చూసి వెళ్లిపోయారనే ప్రస్తావన వస్తుంది. రావణుడు సభకు వచ్చి ప్రయత్నించి ఓడిపోయే సన్నివేశం మాత్రం తర్వాత వచ్చిన జానపద కథల్లో, నాటకాల్లో, మన పాత సినిమాల్లో బాగా పాపులర్ అయింది. వాల్మీకిని ఆధారంగా తీసుకున్నారు కాబట్టి నితీష్ తివారీ ఆ సీన్‌ను పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు.
ఎండ్ టైటిల్స్ పడగానే లేవకండి
సినిమా అయిపోయి టైటిల్స్ మొదలవగానే బయటకు వెళ్లిపోకండి. టైటిల్స్ తర్వాత ఒక సీన్ ఉంది. అది చూశాకే థియేటర్ వదలండి. పార్ట్ 2 మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది.
ప్లస్ & మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్
- రావణుడిగా యష్ నటన
- రాముడిగా, పరశురాముడిగా రణ్‌బీర్ పర్ఫార్మెన్స్
- ప్రతి సీన్ వెనక లాజిక్ చూపించిన కథనం
- ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని స్థాయి విఎఫ్ఎక్స్
- జటాయువు, పరశురాముడి ఎపిసోడ్లు
- ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ డ్రామా
మైనస్ పాయింట్స్
- సెకండ్ హాఫ్‌లో కాస్త నెమ్మదితనం
- సీత పాత్ర అనుకున్నంత బలంగా లేకపోవడం
- కొన్ని పాత్రలకు స్క్రీన్ టైమ్, ఎమోషన్ తక్కువ కావడం
- రాక్షసుల విఎఫ్ఎక్స్, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఫైనల్ వర్డిక్ట్
ఫైనల్‌గా: చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన కథను మనం ఊహించుకున్న దానికంటే గొప్పగా తెరపై చూడటం ఒక మంచి అనుభూతి. 'రామాయణ: పార్ట్ 1' అలాంటి ఎక్స్‌పీరియన్సే ఇస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఓవరాల్‌గా ఇది సంతృప్తిగా బయటకు పంపించే పక్కా థియేటర్ సినిమా. ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకుంటే మిస్ అవుతారు. పిల్లలతో కలిసి పెద్ద స్క్రీన్‌లో, వీలైతే 3డీలో, అది కూడా ఐమాక్స్‌లో చూడండి. ఈ విజువల్స్‌ను మొబైల్ స్క్రీన్‌లో చూస్తే అన్యాయమే. పార్ట్ 2 కోసం ఇప్పటినుంచే ఎదురుచూపులు మొదలైపోయాయి.
