Star Directors Decline: ఒకప్పుడు శుక్రవారం మార్నింగ్ షోకు వెళ్ళడం పండగలా ఉండేది. పోస్టర్ మీద శంకర్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, మురుగదాస్, శ్రీను వైట్ల పేరు కనిపిస్తే కథ తెలియకపోయినా టికెట్ కొనేవాళ్ళం. ఇప్పుడు ఈ పేర్లు కనిపిస్తే “ఈసారైనా పాత మ్యాజిక్ తిరిగొస్తుందా” అనే సందేహం ముందు వస్తోంది. ఎందుకిలా అయిందో చూద్దాం.
శంకర్: రచయిత లేకపోవడం(Star Directors Decline)
‘జెంటిల్‌మన్’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ లాంటి సినిమాలతో సామాజిక సమస్యను కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిపి విజువల్ వండర్‌గా చూపించడం శంకర్ శైలి. ఆయన సినిమాలకు దాదాపు అన్నింటికీ రచయిత సుజాత పని చేశారు. ‘ఒకే ఒక్కడు’ (ముదల్వన్), ‘అపరిచితుడు’, ‘శివాజీ’ లాంటి వాటికి ఆయనే డైలాగులు రాశారు. సుజాత 2008లో ‘రోబో’ పని జరుగుతుండగా మరణించారు. ఆ తర్వాతి సినిమాల్లో రైటింగ్ లోపం కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ అంచనాలను అందుకోలేకపోయాయి. బడ్జెట్, సెట్స్, స్కేల్ ఉన్నా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఆత్మ లేదన్న విమర్శ వినిపిస్తోంది.
త్రివిక్రమ్: డైలాగుల కోసం కథ
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘అతడు’, ‘జులాయి’, ‘అరవింద సమేత’ లాంటి సినిమాల్లో డైలాగ్‌లో జీవిత తత్వం, సందర్భానికి తగిన హాస్యం ఉండేవి. ఈ మధ్య సినిమాల్లో డైలాగులు, కామెడీ కోసం కథను సాగదీస్తున్నారని కొందరు విమర్శకుల వాదన. క్లైమాక్స్‌లో సుదీర్ఘ ప్రసంగం ఒక టెంప్లేట్‌లా మారిందన్న అభిప్రాయమూ ఉంది. అయితే తాజా ‘ఆదర్శ కుటుంబం‘ విషయంలో అభిప్రాయాలు చీలాయి. కొందరు రివ్యూయర్లు కఠినంగా విమర్శించగా, మరికొందరు క్లైమాక్స్‌ను మెచ్చుకున్నారు. మొదటి నాలుగు రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹55.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది (Sacnilk).
పూరి జగన్నాథ్: పాత టెంప్లేట్
‘పోకిరి’, ‘ఇడియట్’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’లో హీరో పాత్రలకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండేది. మాస్ అంటే అరుపులు కాకుండా క్యారెక్టర్ రైటింగ్‌తో వచ్చిన ఆటిట్యూడ్. ‘లైగర్’ భారీ నష్టాలతో డిజాస్టర్ అయింది, ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా సుమారు ₹90 కోట్ల బడ్జెట్‌కు కేవలం ₹20 కోట్ల దగ్గరే ఆగి వరుసగా రెండో ఫ్లాప్ అయింది. పాత టెంప్లేట్‌లో హడావుడి మాత్రం పెంచారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మురుగదాస్: తెలివైన స్క్రీన్‌ప్లే ఏమైంది?
‘గజిని’, ‘తుపాకీ’, ‘కత్తి’ స్క్రీన్‌ప్లేతో, హీరో విలన్ మధ్య మైండ్ గేమ్స్‌తో పేరు తెచ్చుకున్నాయి. ‘సికందర్’ ఫ్లాప్ అయింది, ఆ సినిమా సరిగా తీయలేకపోయానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. హీరోలకు బిల్డప్‌లు ఇవ్వడంపై పెట్టిన శ్రద్ధ కథలో సంఘర్షణ, తెలివైన ట్విస్టులపై పెట్టలేదన్నది విమర్శ.
శ్రీను వైట్ల: అదే కామెడీ ఫార్ములా
‘వెంకీ’, ‘ఢీ’, ‘దూకుడు’లో బ్రహ్మానందం (Star Directors Decline)లాంటి కమెడియన్లతో వచ్చిన కామెడీ థియేటర్లు దద్దరిల్లేలా చేసింది. ‘ఆగడు’ భారీ ఖర్చుతో నిరాశపరిచింది. ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫ్లాప్ అయ్యాయి. ‘విశ్వం’ ₹24 కోట్ల బడ్జెట్‌కు ₹16.61 కోట్ల నెట్ దగ్గరే ఆగి నష్టాల్లో ముగిసింది. విలన్ హీరో ఇంటికి మారువేషంలో వెళ్ళడం, కమెడియన్‌ను బకరా చేయడం అనే ఒకే ఫార్ములాను రీసైకిల్ చేయడం వల్లే కామెడీ పండటం లేదని విమర్శకుల అభిప్రాయం.
