రాధిక ఆప్టే “మేనమామను పెళ్లి చేసుకున్నా” వ్యాఖ్యలపై రచ్చ.. 2014 వీడియో వైరల్, రెండుగా చీలిన నెటిజన్లు

Radhika Apte Legend Comments: నటి రాధిక ఆప్టే ఇటీవల ఓ షోలో తెలుగు సినిమాలో తన అనుభవం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేష్‌తో కలిసి ZOOM ఛానల్ ‘ఫ్యాన్ క్లబ్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె ఈ మాటలు అన్నారు. ఈ క్లిప్‌తో పాటు, ఆమె 2014లో ‘లెజెండ్’ గురించి ఇచ్చిన పాత ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆమె ఏమన్నారు?(Radhika Apte Legend Comments)

తాను చేసిన ఒక తెలుగు సినిమాలో మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, అందులో చాలా పెద్ద వయసు నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని రాధిక చెప్పారు. ఆ సినిమాలో తనకు ప్రతిదీ అయిష్టంగా అనిపించిందని అన్నారు. పితృస్వామ్య వాతావరణంలో ఆ పాత్ర చేయడం తన కెరీర్‌లో కష్టమైన అనుభవమని, పైగా సినిమా మధ్యలో తన పాత్ర చనిపోతుందని, తర్వాత మోసుకెళ్ళే సన్నివేశాలు ఉంటాయని నవ్వుతూ వివరించారు. యాంకర్ ఆశ్చర్యపోయి “What?” అనగానే పక్కనే ఉన్న కీర్తి సురేష్ ఇది తెలుగు, తమిళ సినిమాల్లో చాలా సాధారణమని వివరణ ఇచ్చారు.

క్లిప్‌లో రాధిక సినిమా పేరు గానీ, నటుడి పేరు గానీ చెప్పలేదు. వివరాల ఆధారంగా అభిమానులు అది 2014లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘లెజెండ్’ అని గుర్తించారు.

2014లో ‘లెజెండ్’ గురించి ఆమె ఏమన్నారు?

ఇప్పుడు నెటిజన్లు బయటికి తీసింది ఇండియాగ్లిట్జ్‌కు (Radhika Apte Legend Comments)ఆమె ఇచ్చిన పాత ఇంటర్వ్యూ. ‘లెజెండ్’ విడుదలకు ముందు ప్రమోషన్ సమయంలో ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో ఆమె మాటలు ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

అప్పటివరకు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశానని, ఇంత పెద్ద స్థాయిలో చేసిన తొలి భారీ తెలుగు సినిమా ఇదేనని ఆమె అన్నారు. ఆ సినిమాలో భాగమైనందుకు “చాలా కృతజ్ఞురాలిని” అని చెప్పారు. ట్రైలర్ చూస్తే సినిమా లుక్ రాజసంగా ఉందని, కెమెరా పనితనం అందంగా ఉందని, కథ శక్తివంతంగా, భావోద్వేగంగా ఉందని చెప్పారు. యువకుల నుంచి ఇంట్లో ఉండే మహిళల వరకు, ఉద్యోగస్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ చేరగల ఫ్యామిలీ ఫిల్మ్ అని వర్ణించారు. అందమైన పాత్రలు రాశారని, డ్రామా, ప్రేమ కలగలిసిన శక్తివంతమైన చిత్రంలో భాగం కావడం సంతోషమని అన్నారు.

ఈ వీడియోను షేర్ చేస్తూ కొందరు నెటిజన్లు సరదాగా కాకుండా కటువుగా విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌లో ఆమె స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చారని, అప్పట్లో చెప్పినదానికి ఇప్పుడు చెప్తున్నదానికి సంబంధం లేదని వాళ్ళ వాదన.

విమర్శకుల వాదన

ఆ పాత్ర కథను ముందే విని, ఒప్పుకుని చేశారు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాధిక బాలకృష్ణతో ‘లెజెండ్’, ‘లయన్’ అని రెండు సినిమాల్లో నటించారు. తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వకుండా ఇతర రాష్ట్రాల నటీమణులను తీసుకొస్తున్నారని, వాళ్ళే తర్వాత ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. తెలుగులో గుర్తింపు తెచ్చిన సినిమా గురించే ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని కూడా వాదిస్తున్నారు.

మద్దతుదారుల వాదన

మరోవైపు రాధిక మద్దతుదారులు ఇది కొత్త వ్యాఖ్య కాదంటున్నారు. గతంలో రాజీవ్ మసంద్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు పరిశ్రమను పితృస్వామ్య, పురుషాధిక్య పరిశ్రమగా అభివర్ణించారు. తాను అత్యంత ఇబ్బంది పడింది తెలుగులోనే అన్నారు. ఆ పాత వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ చక్కర్లు కొడుతోంది.

విడుదలకు ముందు ప్రమోషన్‌లో నటులు సానుకూలంగానే మాట్లాడతారని,(Radhika Apte Legend Comments) అది ఒప్పందంలో భాగమని వీరి వాదన. కొత్తగా వచ్చిన నటులకు ఆ సమయంలో అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదని, సెట్‌లో అధికార అసమానతలు ఉంటాయని కూడా అంటున్నారు. ఏళ్ళు గడిచాక, కెరీర్‌లో స్థిరపడ్డాక తమ అనుభవాన్ని బహిరంగంగా చెప్పే హక్కు నటులకు ఉంటుందన్నది వారి అభిప్రాయం.

రాధిక ఆప్టే, కీర్తి సురేష్ నటించిన ‘అక్క’ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. యష్ రాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ 1980ల నేపథ్యంలో నడిచే గ్యాంగ్‌స్టర్ డ్రామా. దాని ప్రమోషన్‌లో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.