Sai Pallavi Ravana Comments: ఒకప్పుడు సాయి పల్లవి అంటే పాజిటివిటీ. పాజిటివిటీ అంటే సాయి పల్లవి. ఆమె సినిమాలో ఉందంటేనే ఆ సినిమాకు ఒక మంచి పేరు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె ఏ సినిమాలో ఉన్నా బయట నెగటివ్ ప్రచారం మొదలవుతోంది. దానికి తోడు ఆమె ఇచ్చే స్టేట్‌మెంట్లు కూడా తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా మరో కాంట్రవర్సీలో అడుగుపెట్టారు సాయి పల్లవి.
“రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు.” ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రామాయణం సినిమాలో అత్యంత కీలకమైన సీతమ్మ పాత్ర పోషిస్తున్న నటి నోటి నుంచి ఈ మాట రావడంతో చర్చ మరింత పెద్దదైంది. అయితే ఆమె ఈ మాట ఏ సందర్భంలో అన్నారో చూస్తే కథ కొంచెం వేరుగా కనిపిస్తుంది.
Sai Pallavi Ravana Comments
ఇంటర్వ్యూలో సాయి పల్లవి రెండు విషయాలు చెప్పారు. మొదటిది సినిమా గురించి. ఇప్పటివరకు ఎన్నో రామాయణం వెర్షన్లు వచ్చాయని, కానీ వీఎఫ్‌ఎక్స్ పరంగా, టాప్ టెక్నీషియన్లతో పని చేసిన విషయంలో తమది ది బెస్ట్ వెర్షన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండోది గ్రంథం గురించి. రామాయణం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఆత్మపరిశీలన అని ఆమె అభిప్రాయం. ప్రతి మనిషిలో మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. మనలో ఉన్న “రావణుడిని” గుర్తించి, ఆ చెడును మార్చుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఈ మాటల మధ్యలోనే “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు” అనే మాట వచ్చింది.
Sai Pallavi at #RamayanaPart1 LA premiere :
“Ravana is not all bad”👀
“It’s important that we spot ravana in us and we make changes over time”
Controversial take 🫠 https://t.co/qyYDlT7R9x
— MR. SP (@Lonely_Prabhhh) October 28, 2026
నిజం చెప్పాలంటే, ఆమె మొత్తం ఉద్దేశంలో తప్పేమీ కనిపించదు. మనలోని చెడును చంపుకోవాలనే చెప్పారు. కానీ ఆ ఒక్క మాటను ఉదాహరణగా ఎందుకు జోడించారో మాత్రం అర్థం కాదు. చెప్పాలనుకున్నది మంచిదే కావచ్చు, కానీ చెప్పిన తీరు తేడా కొట్టింది.
ఇంకో కోణంలో చూస్తే, రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదన్నది కూడా పూర్తిగా అబద్ధం కాదు. ఎంత చెడ్డవాడిలోనైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. రావణుడు పరమ శివభక్తుడు, గొప్ప యుద్ధవీరుడు. ఈ రెండూ కాదనలేని గుణాలు. కానీ అతనిలోని చెడు అంతకంటే చాలా ఎక్కువ. ఆ చెడును మార్చుకుని ఉంటే అసలు రామాయణమే ఉండేది కాదు.
సమస్య ఎక్కడంటే, సోషల్ మీడియాలో ఆ ఒక్క లైన్‌నే కట్ చేసి తిప్పుతున్నారు. ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు అన్నది ఎవరికీ పట్టట్లేదు. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే ఆమె రావణుడిని సమర్థించలేదని, మనిషిలోని చెడు గురించి మాట్లాడారని అర్థమవుతుంది.
అయితే సాయి పల్లవి చుట్టూ ఈ నెగటివిటీ ఊరికే రాలేదు. గతంలో ఆర్మీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఆ ఇమేజ్ ఇంకా ఆమెను వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు ఆమె ఏ మాట అన్నా జనం దాన్ని అనుమానంగానే చూస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేక అలా మాట్లాడుతున్నారా, లేక మాటలు సరిగా కుదరడం లేదా అన్నది ఆమెకే తెలియాలి.
ఏదేమైనా, సీత పాత్ర చేస్తున్న నటి నుంచి జనం ఎక్కువ జాగ్రత్తను ఆశిస్తారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి వివాదాలు సినిమాకూ మంచిది కాదు. ఒకప్పటి “పాజిటివ్ సాయి పల్లవి” ఇమేజ్ తిరిగి రావాలంటే, ఆమె మాటలు కాస్త ఆలోచించి మాట్లాడాల్సిన సమయం ఇది.
