విశ్వక్ సేన్ కెరీర్: 13 సినిమాలు, 5 హిట్లు, 6 ఫ్లాపులు.. ఇప్పుడు భారమంతా ‘కల్ట్’ మీదే
Vishwak Sen Hits and Flops: ఒకప్పుడు విశ్వక్ సేన్ సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో హడావుడి మామూలుగా ఉండేది కాదు. మాస్ డైలాగులు, తెలంగాణ యాస, ఏం మాట్లాడినా నేరుగా మాట్లాడే తీరు, ఇవన్నీ కలిసి యూత్‌లో అతనికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. కానీ గత రెండేళ్ళలో పరిస్థితి మారిపోయింది. వరుస ఫ్లాపులు అతని మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఇప్పుడు ‘కల్ట్(#CULT)‘ విడుదలకు ముందే బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం ఆ దెబ్బ ఎంత లోతుగా తగిలిందో చెప్తోంది.
బాల నటుడి నుంచి హీరో వరకు
విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. 2009లో జగపతి బాబు హీరోగా నటించిన ‘బంగారుబాబు(Bangaru Babu)’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటిసారి తెరపై కనిపించాడు. తర్వాత నటనలో శిక్షణ తీసుకుని హీరో అవకాశాల కోసం తిరిగాడు.
హీరోగా మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే(Vellipomakey)’. షూటింగ్ పూర్తయి విడుదల కావడానికే చాలా కాలం పట్టింది. చివరికి 2017లో దిల్ రాజు చొరవతో థియేటర్లకు వచ్చింది. కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. మొదటి అడుగే తడబడింది.
‘ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi)’తో బ్రేక్
‘వెళ్ళిపోమాకే(Vellipomakey)’ తర్వాత తండ్రి కరాటే రాజు అండతో మలయాళ హిట్ ‘అంగమలీ డైరీస్(Angamaly Diaries)’ ఆధారంగా ‘ఫలక్‌నుమా దాస్(Falaknuma Das)’ మొదలుపెట్టాడు. అది సెట్స్ మీద ఉండగానే తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’లో అవకాశం వచ్చింది. 2018లో వచ్చిన ఆ సినిమా యూత్‌లో కల్ట్ స్టేటస్ సంపాదించింది. విశ్వక్‌కి అసలైన గుర్తింపు అక్కడి నుంచే మొదలైంది.
2019లో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్(Falaknuma Das)’ వివాదాల మధ్యే విడుదలైనా, అతనికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి నిరూపించుకున్న సినిమా అది.
‘హిట్(HIT)’తో మరో మెట్టు
2020లో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్(Hit : The First Case)’ అతని కెరీర్లో మరో కీలక విజయం. మాస్ హంగులు లేకుండా కథ మీదే నడిచే పాత్రలో విశ్వక్ నటుడిగా తన రేంజ్ చూపించాడు.
కానీ తర్వాత వచ్చిన ‘పాగల్(Paagal)’ (2021) నిరాశపరిచింది. ఇదే సమయంలో ‘హిట్ 2’లో నటించే అవకాశం వచ్చినా, అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేయడంతో వదులుకోవాల్సి వచ్చిందని చెప్తారు. ఆ సీక్వెల్ అడివి శేష్‌తో వచ్చి హిట్ అయింది. వెనక్కి తిరిగి చూస్తే అది విశ్వక్ వదులుకున్న పెద్ద అవకాశాల్లో ఒకటి.
2022: రెండూ యావరేజే
2022లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ వచ్చాయి. మొదటిదానిలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కొంతవరకు పనిచేశాయి. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. అదే ఏడాది ‘ముఖచిత్రం’లో అతిథి పాత్రలో కనిపించాడు.
‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’తో మళ్ళీ ఫామ్‌లోకి
2023లో ‘దాస్ కా ధమ్కీ’తో విశ్వక్ మళ్ళీ హిట్ కొట్టాడు. కథ, దర్శకత్వం, నిర్మాణం అన్నీ తానే. ‘ఫలక్‌నుమా దాస్’ తర్వాత మాస్ ఆడియన్స్‌కి మళ్ళీ దగ్గరైన సినిమా ఇది.
2024లో వచ్చిన ‘గామి’ పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. అఘోర పాత్రలో విశ్వక్ కనిపించిన ఈ సినిమా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి చివరికి విడుదలైంది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా థియేటర్లతో పాటు ఇతర హక్కుల ద్వారా కూడా మంచి లాభాలు తెచ్చిందని టాక్.
అదే ఏడాది వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద నష్టాలు రాకపోయినా, నిర్మాతల లెక్కల్లో అది ఆశించిన విజయం కాలేదు.
వరుస దెబ్బలు
ఇక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ‘మెకానిక్ రాకీ’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 2025లో వచ్చిన ‘లైలా’ అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కామెడీ పేలకపోగా, కొన్ని సీన్లు ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించాయి. సినిమా ఫలితంపై విశ్వక్ స్వయంగా క్షమాపణ లేఖ విడుదల చేయడం అప్పట్లో పెద్ద వార్తైంది. ఒక హీరో తన సినిమా గురించి బహిరంగంగా సారీ చెప్పడం తెలుగులో అరుదు.
ఆ తర్వాత వచ్చిన ‘ఫంకీ’ కూడా నిలబడలేదు. మూడు వరుస ఫ్లాపులు విశ్వక్ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి.
కెరీర్ లెక్కలు
‘ముఖచిత్రం’లోని అతిథి పాత్రను పక్కనపెడితే, విశ్వక్ సేన్ హీరోగా ఇప్పటివరకు 13 సినిమాలు చేశాడు.
హిట్స్ (5): ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, హిట్: ది ఫస్ట్ కేస్, దాస్ కా ధమ్కీ, గామి
యావరేజ్ (2): అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా
ఫ్లాప్స్ (6): వెళ్ళిపోమాకే, పాగల్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ
‘కల్ట్(#CULT)’ గట్టెక్కిస్తుందా?
లెక్కలు చూస్తే విశ్వక్ కెరీర్ పూర్తిగా పడిపోలేదు. ఐదు హిట్లు ఉన్న యంగ్ హీరోకి మార్కెట్ ఎప్పుడైనా తిరిగొస్తుంది. కానీ చివరి నాలుగు సినిమాల్లో ఒక్కటీ క్లిక్ కాకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ‘దాస్ కా ధమ్కీ’ లాగే ‘కల్ట్’కి కూడా అన్నీ తానే చూసుకున్నాడు. అప్పుడు ఆ రిస్క్ ఫలించింది. ఈసారి ఫలించకపోతే, విశ్వక్ తన కెరీర్ దారిని ఒకసారి గట్టిగా సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చినట్టే.
